జిల్లాలో 124.425 హెక్టార్లలో బుల్లెట్ రైల్వే లైన్
– భూ నిర్వాసితులకు పరిహారం
– సోషల్ రెహబిలిటేషన్, రీ – సెటిల్మెంట్ అధికారి డా. ఆనంద్
– జిల్లా ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ కోసం వికారాబాద్ జిల్లాలో 124.425 హెక్టార్ల భూమి అవసరమని సోషల్ రెహబిలిటేషన్, రీ – సెటిల్మెంట్ అధికారి డా. ఆనంద్ అన్నారు.
భూ నిర్వాసితులకు భూ సేకరణ చట్టం ప్రకారం డబ్బులు అందరికి చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీ లాల్ అధ్యక్షతన వికారాబాద్ జిల్లా మీదుగా ముంబై నుండి హైదరాబాద్ వరకు హై -స్పీడ్ రైలు కారిడార్ అభివృద్ధిపై పర్యావరణ మరియు సామాజిక అంశాలపై రైతులు, జిల్లా ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ హై స్పీడ్ రైలు జిల్లా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలోని వికారాబాద్,సంగారెడ్డి జిల్లాల మీదుగా వెళుతుందని అన్నారు. ముంబై నుండి హైదరాబాద్ వరకు పది స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముంబై, నవి ముంబై, థానే, పూనె, షోలాపూర్, లోనవాలా, గుల్బర్గా, తాండూర్, వికారాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుందని చెప్పుకొచ్చారు. మొత్తం పది భోగీలతో ఉండే ఈ రైలు గంటకు 330 కి.మీటర్ల వేగంతో వెళుతుందని, ఒక్కో భోగిలో 70 మంది ప్రయానికులు కూర్చొవచ్చని తెలిపారు. హైదరాబాద్ నుండి ముంబైకి కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చని, అదే రైలు మార్గం ద్వారా అయితే 14 గంటల సమయం పడుతుందని వివరించారు.
వికారాబాద్ జిల్లాలోని 5 మండలాలలోని 39 గ్రామాలలో మొత్తం 124.425 హెక్టర్ల భూమి అవసరం ఉంటుందని అన్నారు. భూములు కోల్పోయిన గ్రామాల్లోని రైతులకు భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడం స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పలువురు రైతులు మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా పరిహారం చెల్లెంచాలని కోరారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ ఇది ప్రజాభిప్రాయం మాత్రమేనని, భూములు సేకరణ సమయంలో అందరికి న్యాయం చేయడం స్పష్టం చేశారు. ఈ సందర్బంగా పలువురు రైతులు తెలిపిన ప్రజాభిప్రాయాలను రికార్డు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో HRS కారిడార్ ప్రాజెక్ట్ అధికారి శ్యామ్ చోగ్లె, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
