వచ్చే యేడాదిలో టీకాస్ ట్రయల్స్ పూర్తి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

వచ్చే యేడాదిలో టీకాస్ ట్రయల్స్ పూర్తి
– రైల్వే స్టేషన్లలో పురోగతి సేవలు
– దక్ష‌ణ‌ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: దక్షణ మధ్య రైల్వేశాఖలో దేశంలోనే మొదటి సారిగా నిర్వహిస్తున్న టీకాస్ ట్రయల్ ప్రయోగాలు వచ్చే యేడాది మార్చిలోగా పూర్తి కాబోతున్నాయని ఆ శాఖ జీఎం గజానన్ మాల్య పేర్కొన్నారు.
శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరులోని రైల్వే స్టేషను ఆయన సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పర్యటించి స్టేషన్లో పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాట్లాడుతూ రైలే శాఖ పరిధిలో రైల్వే ప్రమాదాల నియంత్రణలో భాగంగా చేపడుతున్న టీకాస్(ట్రైన్ కొలిజన్ అవైడింగ్ సిస్టమ్) ప్రయోగాలు 1200 కిలో మీటర్ల పరిధిలో కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే యేడాది మార్చిలోగా పూర్తి కాబోతున్నాయని, ఆ తరువాత దేశ వ్యాప్తంగా టీకాస్ అమలయ్యే అవకాశం ఉందన్నారు.
దీంతో పాటు రైల్వే శాఖ పరిధిలో కరోనా మొదటి, రెండో దశలో రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడం జరిగిందన్నారు. రైల్వే శాఖ పరిధిలో 90 శాతం ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపిస్తుండగా.. 70 శాతం మాత్రమే ప్యాసింజర్ రైళ్లను నడిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రజల నుంచి రైళ్లను నడిపించాలని డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు సైతం చేస్తున్న డిమాండ్లపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ పరిధిలోని రైల్వే స్టేషన్ల పరిధిలో అధికారులకు, కార్మికులకు నాణ్యమైన సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు.

తాండూరు స్టేష‌న్‌కు రెండు లిప్టుల మంజూరు
అంతకుముందు రైల్వే స్టేషన్ ను సందర్శించిన జీఎం గజనాన్ మాల్య స్టేషన్లో పలు విభాగాల సేవలను సమీక్షించారు.
స్టేషన్ ప్లాట్ ఫారంపై ప్రతె కంగా ఏర్పాటు చేసిన సేవల ప్రదర్శనను పరిశీలించారు. ఇక్కడ చేస్తున్న విభాగాల విధులు, సేవలను జీఎం గజానన్ మాల్య కొనియాడారు. తాండూరు రైల్వేస్టేష‌న్‌కు రెండు లిఫ్టులు మంజూర‌య్యాయ‌ని, త్వ‌ర‌లోనే ఈ వ్య‌వ‌స్థ‌ను ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీఎం రైల్వే అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రైల్వే కాలనీలో పిల్లల పార్కును జీఎం గజానన్ మాల్య చిన్నారులతో కలిసి ప్రారంభించారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ పరిధిలో పలు విభాగాలను, రైల్వే ట్రాకింగ్ వ్యవస్థలను పరిశీలించారు. ఆయన వెంట డీఆర్ఎం అజయ్ గుప్త, రైల్వే అధికారులు ఉన్నారు.