బడ్జెట్ కేటాయింపులో బీసీలకు అన్యాయం..!
– రాష్ట్రంలో బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలి
– సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించాలి
– బడ్జెట్లో బీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి
– కార్పోరేషన్లకు, ఫెడరేషన్లకు ప్రత్యేక నిధులు సమకూర్చాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు బడ్జెట్ కేటాయింపులలో అన్యాయం జరుగుతోందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

సోమవారం ఆయన ఓప్రకటనలో మాట్లాడుతూ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో బీసీలకు రూ. 50వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా బీసీలకు కేవలం రూ. 9,200 కోట్లు (2024–25), రూ. 11,405 కోట్లు (2025–26) మాత్రమే కేటాయింపులు జరిగాయని తెలిపారు. ప్రతి సంవత్సరం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చినా, వాస్తవ కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. 2023లో ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం సుమారు రూ. 20 వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

అయితే ఇప్పటివరకు ఆ హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని రాజ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం రూ.50 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని, దానికి తగిన బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించాలని, బీసీ కులాలకు చెందిన అన్ని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటి ద్వారా బీసీ కులాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. బీసీ విద్యార్థుల విదేశీ ఉన్నత విద్య కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రూ. 5,000 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


