నాలుగు రోజులు తాగునీటి ఇక్కట్లు తప్పవా..?

తాండూరు వికారాబాద్

నాలుగు రోజులు తాగునీటి ఇక్కట్లు తప్పవా..?
– నిలిచిన భగీరథ నీటి సరఫరా
– మున్సిపల్లో వేధిస్తున్న లీకేజీల సమస్య
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంత వాసులకు నాలుగు రోజులు తాగునీటి ఇక్కట్లు తప్పవా అనే ఆందోళన కలుగుతోంది. తాండూరు నియోజకవర్గానికి సరఫరా అవుతున్న మిషన్ భగీరథ తాగునీరు నిలిచిపోనుంది. దాదాపు నాలుగు రోజుల పాటు తాగునీటి సరఫరా జరగదని జిల్లా మిషన్ భగీరథ అధికారులు వెల్లడించారు. పరిగిలోని గౌరీదేవిపల్లి వద్ద పంపుసెట్ నిర్వహణ పనుల దృష్ట్యా సరఫరాలో అంతారయం విధిస్తున్నట్లు ని వెల్లడించారు. సోమవారం నుంచి 31వ తేది వరకు జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు మున్సిపాల్టీలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటి సరఫరా జరగదని తెలిపారు. ఈ నాలుగు రోజులు తాగునీటి అంతరాయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తాండూరులో తాగునీటి అవసరాలపై ప్రజలు అయోమయానికి గురయ్యారు. తాండూరు పట్టణంలో ప్రత్యామ్నంగా అందించే మున్సిపల్ పంపుహౌస్ నుంచి లీకేజీ సమస్యలు వేధిస్తున్నాయి. గతంలోనే లీకేజీలను మరమ్మత్తులు చేపట్టినా సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తేల్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో పట్టణ వాసులకు తాగునీటి ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.