ఎమ్మెల్యేను దూషిస్తే.. ఖబడ్దార్..!
– కాంగ్రెస్‌పై బురదజల్లడం మానుకోండి
– ప్రజా విశ్వాసం కోల్పోయింది మీరే
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– వచ్చే మూడేళ్లలో అభివృద్ధి చేసేది కాంగ్రెస్సే
– మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని దూషిస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హెచ్చరించారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు అబ్దుల్ రవూఫ్, సర్దార్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, జుబేర్ లాలలు మీడియాతో మాట్లాడారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన వాఖ్యలను ఖండించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ, ఎన్నికల్లో విజయాలను చూసి ఓర్వలేక, జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. తాండూరు అభివృద్ధికి, ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తన్న ఎమ్మెల్యేపై, కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ, ఎంపీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నిల్లో ప్రజలు తిరస్కరించినా బుద్దిరావడంలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమీషన్ ఇచ్చిన నివేధిక మేరకు కాంగ్రెస్ పార్టీ 41శాతం విజయాలు సాధించిందని తెలిపారు. 52వేల ఓట్లలో కాంగ్రెస్‌కు 21వేల ఓట్లు వచ్చాయని, బీఆర్ఎస్‌కు 18వేలు రాగా బీజేపీ గల్లంతు అయ్యిందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అవగాహన లేని చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌లను తెస్తే తాండూరు ఎమ్మెల్యే ప్రజలకు న్యాయం చేస్తారని నమ్మి హాట్రిక్ కౌన్సిలర్లుగా గెలిచిన వారికి అవకాశం కల్పించారని అన్నారు.

గతంలో ఓకే పార్టీలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఉన్నా కూడా వర్గపోరుతో అభివృద్ధిని అడ్డున్నారని విమర్శించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానికేతరుడు కాదని పదే పదే ఆరోపించడం సరికాదని అన్నారు. పరిగికి వెళ్లిపోవడంతో కాదు తాండూరు ప్రజల గుండెలో ఉండిపోతారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఏటీసీ సెంటర్, రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేస్తున్నారని గుర్తుచేశారు. వచ్చే మూడేళ్లు అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రెడ్డి స్వార్థం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరారని, రంగులు మార్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రం వద్దకు కావాలనే వచ్చి లొల్లి చేసింది కాకుండా కేసుల నమోదును కాంగ్రెస్ పార్టీపైకి నెట్టివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రౌడిల్లాగా, దౌర్జన్యానికి దిగినందుకే పోలీసులు కేసులు నమోదు చేశారని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాల్‌లోకి వెళ్లలేదని, మీడియా పాయింట్ దగ్గరే ఆగిపోయారని గుర్తుచేశారు. ఓర్వలేని తనంతో ఎమ్మెల్యేపై, కాంగ్రెస్ పార్టీపై దూషణలు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.


