పాత తాండూరులో హై అలర్ట్
– అతిసారపై ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు
– సందర్శించిన అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అతిసార కేసులపై జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
లక్షణాలు ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు. పాత తాండూరులో అతిసార కేసులు నమోదు కావడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడ దృష్టిసారించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్ నాయక్ పాత తాండూరును సందర్శించారు. వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి అతిసార కేసుల నమోదుపై సమీక్షించారు. స్థానికంగా ఉన్న మున్సిపల్ ట్యాంకులను పరిశీలించి నీటీ నమూనాలను సేకరించారు. అతిసారకు గురైన బాధితుల కుటుంబాలను కలిసి ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తాండూరులో అతిసార కట్టడికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాత తాండూరులో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాంతులు, విరోచనాల లక్షణాలు ఉన్న వారు వైద్య శిబిరంలో సంప్రదించాలని సూచించారు. తీవ్రత ఎక్కు వైన వారిని ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలన్నారు. దీంతో పాటు ముందుజాగ్రత్తగా పాత తాండూరులో ఇంటింటికి ఓఆర్ఎస్, మందులను సరఫరా చేయడం జరుగుతుందని చెప్పారు. అంతేకుండా ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని, అప్పటికప్పుడు వండిన వేడి ఆహారాన్ని తీసుకోవాలని సూచించడం జరుగుతుందని చెప్పారు.
పరీక్షల కోసం నమూనాలు
పాత తాండూరులో అతిసార కేసుల నమోదుపై కారణాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం నీటి ట్యాంకుల నుంచి నీటిని, బాధితుల ఇండ్ల పరిసరాల పరిశీలించి.. ఆహారం, నీటీ నమూనాలను సేకరించడం జరిగిందన్నారు. వీటిని పరీక్షలకు పంపి.. రిపోర్టులు వచ్చిన తరువాత అతిసారకు కారణాలు ఏంటనేవి తేలుస్తామన్నారు.
జాతరకు వెళ్లిన వారిండ్లలోనే కేసులు
మరోవైపు గత రెండు రోజుల క్రితం స్థానికంగా జరిగిన జాతర ఉత్సవాలలో పాల్గొన్న కొన్ని కుటుంబాలలో కేసులు నమోదైనట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారి ఇండ్లలోని కుటుంబ సభ్యులు అతిసార బారిన పడ్డారని అన్నారు. పాత తాండూరు నుంచి మొత్తం 44 కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత దాదాపు 20 మంది కోలుకున్నట్లు తెలిసిందన్నారు. మిగతా వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని తెలిపారు. అత్యవసరమైతే వారికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా దృష్టిసారిస్తున్నామని పేర్కొన్నారు. అడిషనల్ డైరెక్టర్ వెంట వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం, అదనపు అధికారి ధరణికుమార్, తాండూరు పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్, మున్సిపల్ డీఈ రంగనాథం, శానిటరి ఇను స్పెక్టర్ శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు