కోడంగల్‌లో కరోనా కలకలం
– గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కొవిడ్ లక్షణాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు డివిజన్ కోడంగల్ నియోజకవర్గంలో కరోనా వైరస్ కలకలం రేపింది. నియోజకవర్గంలోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఇటీవల గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఆర్బీఎస్‌కే ద్వారా పరీక్షలు నిర్వహించారు. 165 విద్యార్థులతో పాటు 5 మంది ఉపాధ్యాయులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా ఈ పరీక్షల్లో 6, 5 వ తరగతుల్లోని 6 మంది విద్యార్థులకు దగ్గు, జ్వరం వంటి లక్షణాలను గుర్తించారు. అనుమానంతో మరోసారి పరీక్షలు నిర్వహించారు. దీంతో వారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పాఠశాల ఉపాధ్యాయులు వెల్లడించారు. విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలిపి.. వారి ఆదేశాల మేరకు పాజిటివ్ సోకిన విద్యార్థులకు ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సనందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
