సాయిపూర్‌లో శ్రీరామ నవమి శోభ
– ఘనంగా సీతారాముల ఎదుర్కోళ్లు
– పూజలు చేసిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో శ్రీరామ నవమి శోభ సంతరించుకుంది. శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవంను పురస్కరించుకుని గురువారం రాత్రి సాయిపూర్‌లో సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరాజా బాల్ రెడ్డి నేతృత్వంలో ఉత్సవాలను ప్రారంభించారు. సాయిపూర్‌లోని వినాయక దేవాలయం నుంచి సీతారాముల ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపుకు ముందు చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి వినాయకుని, సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు సాయిపూర్‌లోని రామాలయం వరకు కొనసాగింది. దేవాలయం వద్ద సీతారాముల ఎదుర్కోళ్లు సంప్రాదాయ బద్దంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ సీతారాముల కళ్యాణోత్సవం ధర్మాన్ని చాటిందని అన్నారు. సీతారాముల పెళ్లి భక్తిని, పవిత్రతను చాటుతుందని అన్నారు. సీతారాముల కళ్యాణం చూడటం వల్ల, ఆ కళ్యాణోత్సవంలో పాల్గొనడం ఎంతో సుకృతమైందని అన్నారు. శుక్రవారం ఉదయం దేవాలయంలో జరిగే సీతారాముల కళ్యాణంలో భక్తులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.


