జిల్లా ఆసుపత్రిని మార్చొద్దు..!
– ఉనికిని దెబ్బతీస్తే ఊరుకునేది లేదు
– తాండూరులోనే మెడికల్ కాలేజీని కొనసాగించాలి
– ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మార్చొద్దని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

గత కొన్ని రోజులుగా పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని, మాతా శిశు ఆసుపత్రులను కోడంగల్ ఆసుపత్రిగా మారుస్తున్నారని వస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. జిల్లా ఆసుపత్రిని మార్చొద్దంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రులు స్థానిక ప్రజలకే కాకుండా కర్ణాటక, ఇతర ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయని అన్నారు. కొన్ని రోజులుగా జిల్లా ఆసుపత్రిని కోడంగల్ మెడికల్ ఆసుపత్రిగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. అదే జరిగితే తాండూరు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఆసుపత్రిని మారుస్తే వైద్య సేవల్లో వైద్యులు లేక, వసతులు లేక రోగులు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయన్నారు.

అదేవిధంగా జనన, మరణాల దృవపత్రాలు కోడంగల్ పేరుతోనే వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడంగల్కు ప్రభుత్వ ఆసుపత్రిని మార్చే నిర్ణయాన్ని మానుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రులను కోడంగల్కు మార్చొద్దని డిమాండ్ చేశారు. లేదంటే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్, సీనియర్ నాయకులు మోత్కుపల్లి చంద్రశేఖర్, పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బండారు శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, బబ్లు, సాయిలు, రాజు, భీమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.


