మా స్కూల్ భూమిని రక్షించండి
– సెయింట్ మార్క్స్ స్కూల్ విద్యార్థుల ఆందోళన
– న్యాయ పోరాటం చేస్తాం: ప్రిన్సిపల్ ఆరోగ్య రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాస్కూల్ భూమిపై దౌర్జన్యం చేస్తున్న వ్యక్తుల నుంచి రక్షించాలని తాండూరు సెయింట్ మార్క్స్ స్కూల్ విద్యార్థులు డిమాండ్ చేశారు. శనివారం స్కూల్ మైదానం ఆవరణలో ప్రిన్సిపల్ ఆరోగ్య రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల సంస్థకు చెందిన భూమిలో కొందరు ప్రవేటు వ్యక్తులు దౌర్జన్యంగా చొరబడుతున్నారని, గత నెల 28 న స్కూల్ గోడను కూల్చారని ఆరోపించారు.

ఈ కారణంగా స్కూల్ ప్రతినిధులు, టీచర్లపై ఒత్తిడి పెరగడంతో చదువులపై ప్రభావం పడుతుందన్నారు. విద్యకు ఇబ్బందులు, మానసికంగా అవస్థలు ఎదురవుతున్నాయని అన్నారు. దీనిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు ప్రత్యేక చొరవ చూపించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని, మా స్కూల్ భూమిని రక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రిన్సిపల్ ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ సర్వేనెంబర్ 128లో దాదాపు 6 ఎకరాలు 1966 నుంచి సంస్థ ఆధీనంలో భూమి ఉందన్నారు. అందులో సుమారు 28 గుంటల భూమి మాది అంటూ కొందరు ప్రవేటు వ్యక్తులు ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయ పొరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


