నడిరోడ్డుపై ట్రాన్స్ఫార్మర్.. బీజేపీ ఫైర్..!
– రద్దీ ప్రాంతంలో ఏర్పాటు ప్రమాదకరమని ఆందోళన
– దిమ్మ తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాలని డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణ నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

వినాయక చౌక్–పొట్లి మహారాజ్ ఆలయం ఎదురుగా నడిరోడ్డుపై ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతోగురువారం బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు అక్కడికి చేరుకుని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాల ముప్పు ఉంటుందని పేర్కొన్నారు.

చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు, నివాసాలు ఉన్నందున మరింత అప్రమత్తత అవసరమన్నారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. నడిరోడ్డుపై ట్రాన్స్ఫార్మర్ కోసం ఏర్పాటు చేస్తున్న దిమ్మను వెంటనే తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేని ప్రత్యామ్నాయ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం మున్సిపల్ డీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ నగరం మల్లేశం, 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


