ట్రాన్స్ ఫార్మర్ పై పాలిటిక్స్ తగదు..!
– ఉత్సవ సమితి నిర్ణయంపై రాజకీయం ఎందుకు
– అధికారులతో తేల్చుకోవాల్సింది పోయి రచ్చ చేస్తారా..?
– యువజన కాంగ్రెస్ నాయకుడు పునీత్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చౌక్ వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు అంశంపై బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం చేసిన వ్యాఖ్యలపై యువజన కాంగ్రెస్ నాయకుడు పునీత్ స్పందించారు.

ఉత్సవ కమిటీ, హిందూ ఉత్సవ సమితి, ఆర్డీవో, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో తీసుకున్న నిర్ణయాలకు రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. వినాయక చౌక్ ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారని, నిర్ణయం నచ్చకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులపై విమర్శలు చేయడం వల్ల ప్రజల్లో అనవసర గందరగోళం ఏర్పడుతుందని అన్నారు. గత 46 ఏళ్లుగా ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతున్న వినాయక చౌక్ ఉత్సవాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం తగదని పునీత్ పేర్కొన్నారు.

ఉత్సవ కమిటీ, అధికారుల సమన్వయంతో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులను బాధ్యులను చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో నాగారం మల్లేశం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రజాప్రతినిధిగా సమస్యలు కనిపిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని, సోషల్ మీడియా ద్వారా రాజకీయ విమర్శలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సూచనలు చేస్తే స్వాగతిస్తామని, ప్రతి అంశానికి రాజకీయ రంగు పులమడం మానుకోవాలని పునీత్ సూచించారు.

