వచ్చే నెలలో మళ్లీ స్వగృహ ఖాళీ ప్లాట్ల వేలం
– నేడు లబ్దిదారులకు ఫ్రీబిడ్ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం కోకట్ గ్రామ పరిధిలోని రాజీవ్ స్వగృహ ఖాళీ ప్లాట్లకు మళ్లీ వేలం నిర్వహించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గత మార్చిలో ప్లాట్ల వేలం నిర్వహించారు. తాండూరులో మొదటి విడతగా 17 ఫ్లాట్లకు వేలం వేశారు. మిగిలిన ప్లాట్లకు వచ్చెనెల మొదటి లేదా రెండో వారంలో వేలం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా తాండూరులోని ప్లాట్ల వేలానికి సంబంధించి నేడు ఫ్రీబిడ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తాండూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ హాజరై ఫ్రీబిడ్‌పై అవగాహన కల్పిస్తారన్నారు. ఆసక్తిగల వ్యాపారులు, లబ్దిదారులు సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ఇదిలా ఉండగా గతంలో నిర్వహించిన వేలంలో గజానికి రూ. 10 వేల ధర నిర్ణయించడంతో లబ్దిదారులు అంతగా ఆసక్తి చూపలేదు.

