సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సొంత భవనం
– ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. మంజూరుకు కృషి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఆఫీసును ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు.

శుక్రవారం తాండూరు పట్టణంలోని కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కార్యాలయంలో అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, సేవల అందుబాటు, సిబ్బంది పనితీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సేవలు సులభంగా, పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు అనవసర ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అన్నారు. తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు సొంత భవనం నిర్మించేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే మంజూరు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

సొంత భవనం అందుబాటులోకి వస్తే కార్యాలయ నిర్వహణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా ఇకపై తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.


