తాళం కనిపిస్తే.. స్కెచ్‌ రెడీ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాళం కనిపిస్తే.. స్కెచ్‌ రెడీ..!
– పక్కా ప్లాన్‌ వేసి.. చోరీలు
– తాండూరు వరుస దొంగతనాల్లో ముగ్గురి ముఠా
– నిందితుల అరెస్టు, రిమాండుకు తరలింపు
– 10 తులాల బంగారం.. 150 తులాల వెండి రికవరీ
– అపహరించిన రూ.లక్ష నగదు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : పక్కా ప్లాన్‌తో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడ్డుతున్న ముగ్గురు దొంగల ముఠాను తాండూరు పోలీసులు జైలుకు పంపించారు.

తాండూరు పట్టణంలో వరుసగా చోటుచేసుకున్న చోరీల కేసులను ఎట్టకేలకు చేధించారు. మూడు కేసులకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య వెల్లడించారు. వారి నుంచి 10 తులాల బంగారం, 150 తులాల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్‌తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా గండీడ్ మండలం లింగాయిపల్లికి చెందిన అదుల బాబు, వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం కమాల్‌పూర్‌ గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్‌లతో తాండూరు పట్టణం మార్కండేయ కాలనీలో ఉంటున్న ట్రాక్టర్ మెకానిక్ కుమ్మరి ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది.

ఈ ముగ్గురు గత కొన్ని నెలలుగా తాళాలు వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రవీణ్‌ చోరీ చేయాల్సిన ఇండ్లను రెక్కీ చేసి.. అదుల బాబు, శ్రీకాంత్‌లకు సమాచారం అందిస్తే.. వాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. గత యేడాది నవంబర్ నెలలో తాండూరు మున్సిపల్ పరిధి, యాలాల పోలీస్టేషన్‌ పరిధిలో ఉన్న రాజీవ్ కాలనీలో ఓ ఇంటి తాళం విరగ్గొట్టి 3తులాల బంగారం, 50తులాల వెండి దొంగలించారు. ఆ తరువాత ఈనెల 13వ తేదిన తాండూరు పట్టణం గాంధీనగర్‌లో అబ్దుల్ నజీర్ అనే వ్యక్తి ఇంట్లో బీరులో ఉన్న గోల్డ్ నెక్లెస్, వెండి ఆభరణాలు చోరీ చేశారు. అదేవిధంగా ఈనెల 16వ తేదిన తాండూరు పట్టణం మిత్రానగర్‌కు చెందిన హోటల్ యజమాని అయ్యప్ప ఇంట్లో 3గోల్డ్ చైన్‌లు, ఒక గోల్డ్ నెక్లెస్, 3 రింగులు, 3జతల చెవి కమ్మలు మొత్తం 6తులాల బంగారంతో పాటు రూ. 1లక్ష నగదును దోచుకెళ్లారు.

తాండూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన నజీర్ చేసిన ఫిర్యాదు మేరకు తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈక్రమంలో నిందితులు అదుల బాబు, మెకానిక్ ప్రవీణ్‌లు మంగళవారం తాండూరు బస్టాండ్‌లో కనిపించడంతో సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు శ్రీకాంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సొత్తును విక్రయించి పంచుకున్నట్లు విచారణలో తెలిపారు. పోలీసుల విచారణలో అదుల బాబు, శ్రీకాంత్‌లు చోరీలకు పాల్పడగా.. మెకానిక్ ప్రవీణ్‌ సూత్రదారిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి 10 తులాల బంగారం.. 150 తులాల వెండి రికవరీ చేయగా.. అపహరించిన రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు.

కేసు చేధనకు కృషి చేసిన సీఐ పరమేశ్వర్ గౌడ్, ఎస్ఐ నూమల్ అలీ, సిబ్బందిని అభినించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అంజద్, వెంకట్రామ్ రెడ్డి, రామకృష్ణ, షబీల్‌లకు రివార్డులు అందించారు. తాండూరులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్రిగ్గర్ చేస్తే.. ఖబడ్దార్..!