అర్ధరాత్రి ఆసుపత్రుల్లో తనిఖీ..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

అర్ధరాత్రి ఆసుపత్రుల్లో తనిఖీ..!
– జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిలో సేవలపై చైర్‌పర్సన్‌ ఆరా
– మెరుగైన చికిత్సలు అందించాలని సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణను తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి తనిఖీ చేశారు.

ఆదివారం రాత్రివేళ ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా ఆసుపత్రితో పాటు మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రుల్లోని వివిధ విభాగాలను పరిశీలించిన చైర్‌పర్సన్‌.. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాన్ని కూడా ఆరా తీశారు. వైద్యం కోసం వచ్చే ప్రజలకు సకాలంలో సేవలు అందేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని వైద్యులు, సిబ్బందికి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం, అవసరమైన సౌకర్యాలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండగ