మహిళలకు శుభవార్త..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళలకు శుభవార్త..!
– ఐసిడిఎస్ లో 264 ఉద్యోగాలు
– ఆన్లైన్లో దరఖాస్తుకు ఆహ్వానం
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారి ప్రకటన
– పోస్టులు, అర్హత, గడువు వివరాలు ఇవే
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. వికారాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 264 పోస్టుల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

వీటిలో 102 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, 162 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారి తెలిపారు. జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలను కలెక్టర్‌ వెల్లడించారు. కోడంగల్‌ ప్రాజెక్టులో 13 టీచర్‌, 31 ఆయా పోస్టులు, మర్పల్లి ప్రాజెక్టులో 21 టీచర్‌, 14 ఆయా పోస్టులు, పరిగి ప్రాజెక్టులో 27 టీచర్‌, 78 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాండూరు ప్రాజెక్టులో 23 టీచర్‌, 28 ఆయా పోస్టులు, వికారాబాద్‌ ప్రాజెక్టులో 18 టీచర్‌, 11 ఆయా పోస్టులు భర్తీ చేయనున్నారు.

అక్టోబర్‌ 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మహిళా అభ్యర్థులు [అధికారిక వెబ్‌సైట్‌](http://wdcw.tg.nic.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, స్థానికత, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, ఇతర నిబంధనలను వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని కలెక్టర్‌ సూచించారు. ఆయా అంగన్‌వాడీ కేంద్రాలకు కేటాయించిన రిజర్వేషన్‌కు అనుగుణంగా అర్హులైన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 1వ తేదీ వరకు సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల్లో కార్యాలయ పనివేళల్లో దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాల గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన జిరాక్స్‌ ప్రతులను సమర్పించాలి. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు సంబంధిత చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఆర్టీసీలో హోరా.. హోరీ..!