ఇందిరమ్మ బీమా.. పేదలకు ధీమా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇందిరమ్మ బీమా.. పేదలకు ధీమా..!
– ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా
– అర్హులందరూ నమోదు చేసుకోవాలి
– మున్సిపల్ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి
– తాండూరులో 28, 29 వార్డుల్లో పథకం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.

తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 28, 29 వార్డుల్లో ఈ పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు రూ.5 లక్షల జీవిత బీమా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తెల్ల రేషన్‌ కార్డు కలిగి, 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులందరికీ నామినీ సౌకర్యం కల్పించే అవకాశం ఉందన్నారు. తాండూరు మున్సిపాలిటీలోని మొత్తం 36 వార్డుల్లో దశలవారీగా నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు రేషన్‌ కార్డు, సంబంధిత పత్రాలతో తమ వార్డుల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రాలకు వెళ్లి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

సందేహాలుంటే మున్సిపల్‌ అధికారులు, వార్డు కౌన్సిలర్లను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ రజాక్‌, బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, మున్సిపల్‌ కమిషనర్‌ రాకేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

అబ్దుల్‌ రవూఫ్‌కు బీఎస్‌ఆర్‌ పరామర్శ