ద‌ద్ద‌రిల్లిన చావుడ‌ప్పు

తాండూరు రాజకీయం వికారాబాద్

ద‌ద్ద‌రిల్లిన చావుడ‌ప్పు
– ఊరూరా నిర‌స‌న‌లు, శ‌వ‌యాత్ర‌లు
– కేంద్ర వైఖ‌రిపై దండెత్తిన గులాబీ నేత‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల పిలుపు మేర‌కు తాండూరులో చేప‌ట్టిన టీఆర్ఎస్ నిర‌స‌నల చావుడ‌ప్పు ద‌ద్ద‌రిల్లింది. నియోజ‌క‌వ‌ర్గంలోని ఊరూరా చావుడ‌ప్పు, ర్యాలీలు, ఊరేగింపు, శ‌వ‌యాత్ర‌లతో గులాబీ నేత‌లు కేంద్రం తీరుపై దండెత్తారు. తాండూరు మున్సిప‌ల్, తాండూరు మండ‌లం, యాలాల మండ‌లం, బ‌షీరాబాద్ మండ‌లం, పెద్దేముల్ మండ‌లాల్లో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు హోరెత్తాయి.

సాయిపూర్‌లో మోగిన చావుడ‌ప్పు
తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి సాయిపూర్‌లో మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం)ల ఆధ్వ‌ర్యంలో చావుడ‌ప్పు నిర‌స‌న చేప‌ట్టారు.
వార్డులో ప్ర‌ధాని దిష్టిబొమ్మ‌ను ఊరేగించారు. ఊరేగింపు ముందు చావుడ‌ప్పు మోత మోగింది. శవ‌యాత్ర అనంత‌రం మోడి దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, అఫ్పూ(న‌యూం)లు మాట్లాడుతూ యాసంగిలో కేంద్రం భేష‌ర‌తుగా ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రం దిగివ‌చ్చే దాక కేంద్రంపై ఉద్యమించాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు రాజుగౌడ్, కౌన్సిల‌ర్లు, యువ నాయ‌కులు, మ‌హిళ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

యాలాల‌లో దిష్టిబొమ్మ ద‌హ‌నం
యాలాల మండ‌లం కోక‌ట్ గ్రామంలో టీఆర్ఎస్ నాయ‌కులు చావుడ‌ప్పు నిర‌స‌న కార్య‌క్ర‌మం భారీ ఎత్తున కొన‌సాగించారు.
టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌రణం పురుషోత్తంరావు ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు సిద్రాల శ్రీ‌నివాస్, పీఏసీఎస్ చైర్మ‌న్ సురేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు గ్రామంలో మోడి దిష్టిబొమ్మ‌, శవ‌యాత్ర ఊరేగించారు. గ్రామంలోని ప్ర‌ధాన వీధిలో మోడి దిష్టి బొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌ర‌ణం పురుషోత్తంరావు, నాయ‌కులు మాట్లాడుతూ కేంద్రం రైతుల ప‌ట్ట వివ‌క్ష‌ను మానుకోవాల‌న్నారు. యాసంగిలో ధాన్యం కేంద్ర‌మే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు.