పెండ్లీళ్లకు కరోనా గండం..!
– వివాహా వేడుకలపై తీవ్ర ప్రభావం
– కొత్త జంటల్లో టెన్షన్, అయోమయంతో కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పెండ్లి అంటే నూరేళ్ల పంట.. అందుకే ఈ వేడుకను ఎవరైనా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.. కానీ ప్రస్తుతం పెండ్లిళ్లపై కరోనా ప్రభావం చాలా మంది సంక్రాంతి పీడ దినాలు వెళ్లగానే ఫిబ్రవరి మాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో పెండ్లిళ్లకు సిద్ధమయ్యారు. కానీ థర్డ్ వేవ్ రూపంలో మళ్లీ కరోనా కోరలు చాచడంతో ఇటు తల్లిదండ్రులతోపాటు, కొత్త జంటలు సైతం అయోమయంలో పడ్డాయి. గత మూడు నెలలుగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుందామని కొత్తజంటలు భావించాయి.
ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకుని… ముహుర్తాలు పెట్టుకుని పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూసేవారికి థర్డ్ వేవ్ పెద్ద షాకే ఇచ్చినట్లైంది.. కల్యాణ మండపాలకు, బ్యాండ్, క్యాటరింగ్ వారికి అడ్వాన్స్లు సైతం చెల్లించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో పలువురు వాటిని రద్దు చేసుకుంటున్నారు. మరికొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీనికి తోడు పెండ్లిళ్లపై ఆధారపడిన వారి ఉపాధిపై సైతం తీవ్ర ప్రభావం పడింది.. మొత్తానికి పెళ్లి వేడుకలకు కరోనా గండం తప్పడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావం వల్ల అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సారి శుభకార్యాలు అనుకున్నట్లు జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.

