డ్ర‌గ్స్, గంజాయి నిర్మూల‌నే ల‌క్ష్యం

క్రైం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

డ్ర‌గ్స్, గంజాయి నిర్మూల‌నే ల‌క్ష్యం
– సామాజిక బాధ్య‌త‌గా నియంత్ర‌ణ ఉద్య‌మం
– పోలీసు, ఎక్సైజ్ స‌మావేశంలో సీఎం కేసీఆర్
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణలో గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని సమూలంగా నిర్మూలించడ‌మే ల‌క్ష్యంగా పోలీస్, ఎక్సైజ్ అధికారులు కృషి చేయాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్ర‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ శాఖ‌ల‌తో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో ప‌లు కీల‌క స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు. దేశంలో దుర్వ్య‌నసంగా మారిన గంజాయి, డ్ర‌గ్స్ వాడ‌కంను నిర్మూలించేందుకు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలని అన్నారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

1000 మందితో కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ సెల్
స‌మాజంలో నార్కోటిక్ డ్రగ్స్ వాడకం, గంజాయి వ్య‌స‌నాలు చీడ పురుగుల్లా మారాయ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం అన్నారు. 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు రివార్డులు ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందనీ సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు శ్రీ బీబీ పాటిల్, శ్రీమతి కవితా నాయక్, ఎమ్మెల్యేలు శ్రీ బాల్క సుమన్, శ్రీ రెడ్యానాయక్, శ్రీ రవీంద్ర కుమార్ నాయక్, శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ రాజేందర్ రెడ్డి, శ్రీ సుంకే రవిశంకర్, శ్రీ కృష్ణ మోహన్ రెడ్డి, శ్రీ గాదరి కిశోర్ కుమార్, శ్రీ సాయన్న, శ్రీమతి రేఖా నాయక్, శ్రీ అబ్రహం, శ్రీ హన్మంతు షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ శ్రీ అనురాగ్ శర్మ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సి.వి. ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేశ్ భగవత్, సీఎంఓ అధికారులు శ్రీ నర్సింగ రావు, శ్రీ భూపాల్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రవి గుప్తా, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్లు, డీసీలు, పోలీస్ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, ఎస్పీలు, కమిషనర్లు, డీసీలు తదితరులు పాల్గొన్నారు.