జెడ్పీ నిధులతో గ్రామాలకు అప్రోచ్ రోడ్లు
– జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్‌రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : జిల్లా పరిషత్ నుంచి గ్రామీణ ప్రాంతాల అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం డీఆర్సీ భవనంలో పీఎన్‌జీఎస్‌వై పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాన రోడ్లు నుంచి జిల్లాలో అన్ని గ్రామాలకు లింకు రోడ్లు అప్రోచ్ రోడ్లు చేయాల్సిన అవరాన్ని గుర్తించి జిల్లా పరిషత్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే సిసి రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం సీసీ రోడ్లతో పాటు బీటీ, అప్రోచ్, ఫార్మేషన్ రోడ్లకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల జిల్లా పరిషత్ నిధుల ద్వారానే గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మంజూరైన రోడ్ల నిర్మాణ పనులను క్వాలిటీతో నిర్మాణం చేయాలని సూచించారు. అదేవిధంగా 250 జనాభా ఉన్న ప్రతి పల్లెకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా మొరం రోడ్డు నిర్మాణానికి అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అదనపు కలెక్టర్ కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి, పి ఆర్ ఇఇ శ్రీనివాస్ రెడ్డి, డి ఇలు, ఎఇలు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

