దళితబంధు రగడ
– అర్హులందరికి వర్తింప జేయాలి
– విచారణ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు
– పెద్దేముల్ మండలం జనగామలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సర్కారు దళితుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న దళిత బంధుపై దళితులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులను పారదర్శంగా ఎంపిక చేయడం లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే అడ్డుకుంటున్నారు. దళిత బంధుపై తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో పెద్ద రగడ చోటు చేసుకుంది. ప్రభుత్వం హుజూరా బాద్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది దళితులను ఎంపిక చేయాలని బాధ్యతలు అప్పగించారు. దీంతో గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి లబ్దిదారులను ఎంపిక చేసేందుకు సర్వే ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం పెద్దేముల్ తహసీల్దార్ అధికారులతో కలిసి మండలం జనగామ గ్రామంలో లబ్దిదారుల వెరిఫికేషన్ కోసం వెళ్లారు. గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో 15 మంది పేర్లను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన లబ్దిదారుల వివరాలను నమోదు చేసుకునేందుకు శుక్రవారం అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం ముందే తెలిసిపోవడంతో గ్రామంలోని దళితులంతా ఏకమయ్యారు. విచారణకు వచ్చిన తహసీల్దార్, అధికారులను అడ్డుకున్నారు.

గ్రామంలో దళితులు చాలా మందే ఉన్నారని, కేవలం 15 మందినే ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. గ్రామంలో దళితులందరికి దళితబంధు వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటి తరువాత గ్రామస్తులు మండల తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

