భార్య హత్యకేసులో భర్తకు జీవిత ఖైదు
– రూ. 10 వేల జరిమాన
తాండూరు, దర్శిని ప్రతినిధి : భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమాన విధిస్తూ హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం న్యాయమూర్తి టీ. జయలక్ష్మీ తీర్పు వెలువరించడం జరిగిందని తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన చెన్నారం శేఖర్‌తో ఆయనకు మేనత్త అయిన చెన్నారం పద్మమ్మతో గత 20 ఎండ్ల క్రితం వివాహము జరిగింది. కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. దీంతో పద్మమ్మ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడ పద్మమ్మ వెన్నల మురళీ అనే వ్యక్తిని రెండో వివాహము చేసుకుంది. అయితే 2021లో కొవిడ్ లాక్‌డౌడ్ కారణంగా పద్మమ్మ హాజీపూర్‌కు వచ్చి ఉండిపోయింది. అదే యేడాది ఏప్రిల్ 28న పద్మమ్మ రక్తగాయాలతో పడి ఉండగా ఆమెను మొదటి భర్త చెన్నారం శేఖర్, గ్రామస్తుల సహాకారంతో తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పద్మమ్మ మరణించింది. దీనికి రెండో భర్త వెన్నెల మురళీపై అనుమానం ఉందని చెన్నారం శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్ సీఐ జలంధర్ రెడ్డి తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని చార్జ్ షీట్ నమోదు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని VII ADJ, ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో హాజరు పరుచగా న్యాయమూర్తి టీ. జయలక్ష్మీ కేసు పూర్వాపరాలను పరిశీలించగా నిందితుడి నేరం రుజువైంది. ఈ మేరకు నిందితుడు అయిన వెన్నెల మురళీకి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు సీఐ జలంధర్ రెడ్డి తెలిపారు. కేసును పరిష్కరించిన సీఐ, డీఎస్పీలను వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి అభినందించారు.

