పోలీస్ స్టేష‌న్‌కు పిల్లి పంచాయ‌తీ

క్రైం తెలంగాణ

పోలీస్ స్టేష‌న్‌కు పిల్లి పంచాయ‌తీ
– మాదంటే మాదంటూ ఇద్ద‌రు మ‌హిళ‌ల కొట్లాట‌
– త‌ల‌లు ప‌ట్టుకుంటున్న పోలీసులు
ద‌ర్శిని డెస్క్ : ఎవ‌రైనా ఆస్తి, భూ త‌గాదాలు, దొంగ‌త‌నాలు వంటి విష‌యాల‌పై పోలీస్టేష‌న్ మెట్లు ఎక్కుతారు. కాని ఇద్ద‌రు మ‌హిళ‌లు ఒక పిల్లి కోసం పోలీస్టేష‌న్‌లో పంచాయ‌తీకి వ‌చ్చారు. పిల్లి మాదంటే మాదంటూ పోలీసుల ముందే త‌గవులాట‌కు సిద్ద‌మ‌య్యారు. ఈ వింత సంఘ‌ట‌న సూర్యాపేట జిల్లా (Suryapet District) హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ముత్యాలమ్మ కొంతకాలం క్రితం మైసూర్ నుంచి ఓ పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటుంది. 15 నెలల క్రితం ఈ పిల్లి తప్పిపోయింది. పిల్లి కోసం ముత్యాలమ్మ వెతకని చోటు లేదు. ఈ పిల్లి కోసం ముత్యాలమ్మ పిల్లలు కూడా బెంగ పెట్టుకున్నారు. హుజూర్ నగర్ పట్టణంలో ఉండే సుక్కమ్మకు ఈ పిల్లి దొరికింది. అప్పటి నుంచి ఈ అరుదైన పిల్లిని చాలా ప్రేమగా పెంచుకుంటుంది. అయితే ముత్యాలమ్మ పిల్లలు ఆడుకుంటూ సుక్కమ్మ ఇంటి వద్ద ఉన్న పిల్లిని గుర్తుపట్టారు. దీంతో ఈ పిల్లి మాదంటే మాది అంటూ పెద్ద గొడవకు దిగారు ఇరువర్గాలు. చివరికి ఈ పిల్లి పంచాయతీ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ పిల్లి పంచాయితీ కోసం ఇరు వర్గాలకు చెందిన 50 మందికిపైగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారంటే ఈ పిల్లి పంచాయితీ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ పిల్లి పంచాయితీకి సంబంధించి పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ పిల్లి పంచాయతీని ఎలా పరిష్కరించాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.