మాణిక్యానికి మ‌నీ క‌ష్టాలు..!

క్రైం రంగారెడ్డి వికారాబాద్

మాణిక్యానికి మ‌నీ క‌ష్టాలు..!
– సెల్ ట‌వ‌ర్ పైకెక్కి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
– బిల్లులు చెల్లించ‌డంలేద‌ని జిల్లా ఎక్సైజ్ శాఖ‌పై ఆరోప‌ణ‌లు
– న‌చ్చ‌జెప్పిన స్థానికులు, శాంతించి కింద‌కి వ‌చ్చిన వైనం
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : మూడేళ్లుగా త‌న సేవ‌లందించుకుని డ‌బ్బులు ఇవ్వంకుండా వేధిస్తున్నార‌ని ఓ వ్య‌క్తి సెల్ ట‌వ‌ర్ పైకెక్కి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. ప్ర‌భుత్వంలోని ఎక్సైజ్ శాఖ అధికారుల‌పైనే బాధితులు ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌మనించిన స్థానికులు న‌చ్చ‌జెప్ప‌డంతో కింద‌కు దిగాడు. మంగ‌ళ‌వారం వికారాబాద్ మున్సిప‌ల్ స‌మీపంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. జిల్లా ఎక్సైజ్ శాఖ‌లో మాణిక్యం అనే వ్య‌క్తి టాటా సుమో డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మూడేళ్లుగా త‌న‌కు రావాల్సిన బిల్లుల‌ను అధికారులు చెల్లించ‌డం లేదంటూ మంగ‌ళ‌వారం మున్సిప‌ల్ కార్యాల‌య స‌మీపంలో ఉన్న సెల్ ట‌వ‌ర్ పైకి ఎక్కాడు. అక్క‌డి నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌య‌త్నానికి య‌త్నించాడు. గ‌మ‌నించిన స్థానికులు న‌చ్చ‌జెప్ప‌డంతో కింద‌కి దిగివ‌చ్చాడు. అనంత‌రం మాణిక్యం మాట్లాడుతూ గ‌త మూడేళ్లుగా త‌న‌కు రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కు బిల్లులు రావాల్సి ఉంద‌ని తెలిపాడు. బిల్లులు చెల్లింపులో కావాల‌ని జాప్యం చేస్తున్నార‌ని, అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించాడు. డ‌బ్బులు లేక‌పోవ‌డంతో కూతురు పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆవేధ‌న వ్యక్తం చేశారు. ఏదేమైనా సెల్ ట‌వ‌ర్ పైకి ఎక్కిన మాణిక్యం కింద‌కి దిగిరావ‌డంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మాణిక్యం కిందకి దిగే క్రమంలో తేనెతీగలు దాడి చేశాయి. కిందకి తరువాత మాణిక్యం ఆసుపత్రిలో చేరారు.

నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన జిల్లా ఎక్సైజ్ అధికారి

మ‌రోవైపు జ‌రిగిన సంఘ‌ట‌న‌పై జిల్లా ఎక్సైజ్ అధికారి నిర్ల‌క్ష్యంగా వ‌హ‌రించాడాన్ని స్థానికులు త‌ప్పుప‌డుతున్నారు. విలేక‌రులు వివ‌ర‌ణ కోసం ఫోన్ చేసినా స‌రైన విధంగా స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. గ‌తంలో కూడ జిల్లా ఎక్సైజ్ అధికారి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని గుర్తుచేస్తున్నారు.