పది మందితో దౌర్జన్యం..!
– అర్దరాత్రి కార్యాలయంపై దాడి
– నగదు, విలువైన పత్రాల అపహరణ
– న్యాయం చేయాలన్న బీఆర్‌ఎస్ నేత
– తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పది మందితో కలిసి కొందరువ్యక్తులు తన వ్యక్తిగత కార్యాలయంపై దాడిచేశారని తాండూరు పట్టణ బీఆర్‌ఎస్ నేత, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబేర్ లాల అన్నారు. నగదుతో పాటు విలువైన పత్రాలను ఎత్తుకెళ్లిపోయారని, జరిగిన సంఘటనపై తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన తెలిపిన వివరాలిలా ప్రకారం… పట్టణంలోని ముర్షద్ దర్గా సమీపంలో ఓ గదిలో సయ్యద్ జుబేర్ లాల వ్యక్తిగత కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే గురువారం తెల్లవారు జాము సమయంలో అస్లాం, ఖాలీద్ అనేవ్యక్తులు మరో పది మందితో కలిసి కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించారు.
దౌర్జన్యంగా కార్యాలయంలో ఉన్న తన వ్యాపారంతో పాటు ఇతర విలువైన పత్రాలు, సుమారు రూ.1లక్ష నగదును ఎత్తుకెళ్లిపోయారని తెలిపారు. అందులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చిత్రపటం, ఎలక్‌ట్రానిక్ వస్తువులు కూడా ఉన్నాయన్నారు. గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో ఆఫీసును సందర్శించగా విషయం తెలిసిందన్నారు. ఆఫీసుకు తాళం వేసినా కూడా ధ్వంసం చేసి.. దౌర్జన్యం ప్రదర్శించారని ఆందోళన వ్యక్తం చేశారు. కక్ష్యపూరితంగా వ్యవహరించిన వ్యక్తులపై తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. పోలీసు అధికారులు స్పందించి సత్వర న్యాయం చేయాలని కోరారు.

ఇదికూడా చదవండి…

