ప్ర‌జా రక్ష‌ణ పోలీసుల క‌ర్త‌వ్యం

క్రైం తాండూరు వికారాబాద్

ప్ర‌జా రక్ష‌ణ పోలీసుల క‌ర్త‌వ్యం
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
– వికారాబాద్ రాజీవ్ గృహ‌క‌ల్ప‌లో కార్డెన్ సెర్చ్
– నిషేధిత గుట్కా, మ‌త్తు ప‌దార్థాలు గుర్తింపు
– భారీగా వాహనాలు స్వాధీనం
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌జా సంర‌క్ష‌ణే పోలీసుల ప్ర‌థ‌మ క‌ర్త‌వ్య‌మ‌ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. ఎస్పీ ఆదేశాల మేర‌కు సోమ‌వారం ఉద‌యానికి ముందు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వ‌హించారు. పోలీసులు ప్ర‌తి ఇంటిని క‌ట్ట‌డి చేసి త‌నిఖీలు నిర్వ‌హించారు. అద్దెకు నివాస‌ముంటున్న వారి వివ‌రాల‌ను ఆరా తీశారు. ప‌లు వాహ‌నాల‌ను సంబంధించి ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో నిషేధిత గుట్కా, మత్తు ప‌దార్థాలు భారీగా ల‌భ్య‌మ‌య్యాయి. అదేవిధంగా ఎలాంటి దృవీక‌ర‌ణ ప‌త్రాలు లేని వాహానాలు భారీగా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున వాహ‌నాలు స్వాధీనం చేసుకోవ‌డంతో రాజీవ్ గృహక‌ల్ప కాల‌నీ షోరూంను త‌ల‌పించింది. దీంతో పాటు రెండు క‌త్తుల‌ను కూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం కార్డెన్ సెర్చ్‌ను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజీవ్ కాల‌నీ గురించి ఎక్కువ ఫిర్యాదులు రావ‌డం జ‌రిగింద‌ని, దీనిని దృష్టిలో ఉంచుకుని కాల‌నీలో కార్డెన్ సెర్చ్ చేప‌ట్టేందుకు ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రైనా గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు కాల‌నీల్లో త‌ల‌దాచుకుంటే పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌న్నారు. ప్ర‌జా సంర‌క్ష‌ణే ధ్యేయంగా పోలీసుశాఖ ప‌నిచేస్తుంద‌న్నారు. ప్ర‌జా ర‌క్ష‌ణ‌, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణే పోలీసుల క‌ర్తవ్య‌మ‌న్నారు. అదేవిధంగా కార్డెన్ సెర్చ్‌లో ప‌ట్టుబ‌డిన వాహ‌నాల‌కు సంబంధించి స‌రైన దృవ‌ప‌త్రాలు చూపిస్తే వాహానాల‌ను వ‌దిలేస్తామ‌ని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, టౌన్ సీఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.