సిటీ స్కాన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునితారెడ్డి
– ఎమ్మెల్యే, కలెక్టర్‌తో కలిసి సిటి స్కాన్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద రోగుల కోసం జిల్లా ఆసుపత్రిలో ప్రారంభిస్తున్న సిటి స్కాన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో బోయింగ్ కంపెనీ సహాకారంతో రూ. 1.50 కోటితో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్‌ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితారెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, కంపెనీ ప్రతినిధులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్
సునితారెడ్డి మాట్లాడతూ ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తోందన్నారు. తాండూరులో పేద రోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ద్వార బోయింగ్ కంపెనీ ద్వారా సిటి స్కాన్‌ను అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా జిల్లా ఆసుపత్రిలోనే సిటి స్కాన్ సేవలను పొందాలన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసులు మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న తాండూరు ప్రాంత వాసులను దృష్టిలో ఉంచుకుని సిటి స్కాన్ విరాళంగా అందించిన బోయింగ్ కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయింగ్ కంపెనీ ప్రతినిధులు ప్రవీణ యజ్ఞంబాత్, రీతు శర్మ, సౌరభ్ తనేజా, డాక్టర్ ఫర్ యూ సంస్థ ప్రతినిధులు డాక్టర్ రజత్ జైన్, డాక్టర్ గ్లోరీ, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ నీరజా బాల్‌రెడ్డి, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున స్వామి, టీఆర్ఎస్ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
