కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణపై స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

కెరీర్ తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణపై స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం
– ఉద్యోగుల‌ ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశాలు
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ‌ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై స‌ర్కారు ముందడుగు వేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ అర్హతల ఆధారంగా రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన జారీ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. 2016లో జారీ చేసిన జీవో 16 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు పంపాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని కోరింది. కాగా, ఇక రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను కూడా ప్రారంభించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల‌కు ఇది మంచి శుభ‌వార్తే.