ఆ గ్రామంలో డిజిటల్ వాటర్ ప్లాంట్
– 24 గంటల పాటు శుద్దినీటి సరఫరా
– జిల్లాలోనే తొలిసారి ఏర్పాటు
– కర్ణాటక సరిహద్దు గ్రామం ఘనత
– రీచార్జ్ వ్యవస్థతో నీటీ సరఫరా
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కర్ణాటక సరిహద్దులోని ఆ గ్రామంలో వేసవి వచ్చిందంటే ట్యాంకర్లతో నీటి కరువును తీర్చుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని దాటుకుని జిల్లాలోనే తొలిసారిగా నేడు గ్రామంలో ఎనిటైం వాటర్ వ్యవస్థ ఏర్పాటుకు వేదికైంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని తాండూరు మండలం ఐనెల్లి గ్రామం ఈ ఘనతను సాధించింది. రీచార్జ్ విధానంతో 24 గంటలు తాగునీటీ సరఫరా సదుపాయాన్ని అందిపుచ్చుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం ఐనెల్లి గ్రామంలో 250 కుటుంబాలు, 13వేలకు పైగా జనాభా. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో నేలంతా బండలతో ఉంటుంది. వేసవి వచ్చిందంటే గ్రామంలో నీటి ఎద్దడిని తీర్చుకోవడానికి ఇక్కట్లను ఎదుర్కోనేవారు. ప్రత్యేక ట్యాంకర్లతో నీటిని అందించి కష్టాలను తీర్చుకునేవారు.
అందుబాటులోకి డిజిటల్ వాటర్ ప్లాంట్
ఐనెల్లి అంటేనే తాగునీటి కష్టాలకు అడ్డాగా ఉంటే నేడు ఆ గ్రామంలో డిజిటల్ వాటర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిందంటే ఆశ్చర్య పోవాల్సిన విషయమే. ముంబయి కేంద్రంలో తాండూరు మండలంలోని జినుగుర్తి గ్రామంలో కొనసాగుతున్న ఆప్రవ సౌర విద్యుత్ కేంద్రం స్పందించి గ్రామంలో ఎనీటైం వాటర్ వ్యవస్థ ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. సామాజిక బాధ్యత కింద ఈ సంస్థ పలు గ్రామాల్లో బాల వికాస స్వచ్చంద పేరుతో గత ఏడాది నుంచి సేవా కార్యక్రమాలను చేపడుతుంది. ఈ క్రమంలో ఐనెల్లిలోని తాగునీటి సమస్యను గుర్తించి సౌర విద్యుత్ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన సంస్థ రూ. 4 లక్షలతో 500 లీటర్ల సామర్థ్యం ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది.
రీచార్జ్ విధానంతో తాగునీటి సరఫరా
అయితే ఈ వాటర్ ప్లాంట్ నుంచి ఎనిటైం వాటర్ ను పొందేందుకు రీచార్జ్ విధానంను ప్రవేశ పెట్టారు. ఈ విధానాన్ని అమలు చేయడం జిల్లాలో ఇదే మొదటి సారి. నిర్వహణ చేస్తున్న సంస్థ నుంచి గ్రామస్తులకు ఏటీఎం కార్డు తరహాలో ఏటీడబ్ల్యూ(ఎనిటైం వాటర్) కార్డును అందజేశారు. కార్డును తీసుకున్న లబ్దిదారుడు రూ. 5 లతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీచార్జ్ కాల పరిమితి 24 గంటల వరకు ఉంటుంది. గడువు ఉన్న సమయంలో ఎప్పుడైనా నీటిని పొందవచ్చు. ఒక కార్డు ద్వారా 20 లీటర్ల నీటిని పట్టుకునే వెసులుబాటును కల్పించారు. కార్డు పెట్టిన వెంటనే నీటీ సరఫరా ప్రారంభమవుతుంది. ఈ విధానంలో గ్రామంలోని 60 కుటుంబాలు రీచార్జ్ కార్డులను పొంది లబ్దిపొందుతున్నారు.

