ఇంటర్ పరీక్షా కేంద్రాలకు జీపీఎస్
– కోడ్ ఎంటర్ చేస్తే కేంద్రానికి దారి
– బోర్డు అధికారుల చర్యలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: కరోనా మహమ్మారి తరువాత నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేనెల 6 నుంచి మొదటి సంవత్సరం, 7 నుంచి రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కోడంగల్ నియోజకవర్గాలలో మొత్తం 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా తగ్గిపోవడం, స్థలం సరిపోకపోవడంతో బెంచీకి ఇద్దరు చొప్పున గదికి 20 నుంచి 25 మందిని కూర్చోబెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు ఆయా పరీక్షా కేంద్రాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలో కేటాయించబడిన విద్యార్థి కేంద్రం కోడ్‌ను జీపీఎస్లో నమోదు చేస్తే కేంద్రానికి వెళ్లే మార్గాన్ని చూపిస్తుంది. దీంతో విద్యార్థి ఎలాంటి అసౌకర్యం లేకుండా నేరుగా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంటుంది.

