త్వ‌ర‌లో 5-12 ఏండ్ల చిన్నారుల‌కు టీకా..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

త్వ‌ర‌లో 5-12 ఏండ్ల చిన్నారుల‌కు టీకా..!
– క‌స‌ర‌త్తు చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం
ద‌ర్శిని డెస్క్: క‌రోనాను నియంత్రించేందుకు వ్యాక్సీనేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతూనే ఉంది. మొద‌ట 60 ఏండ్లు నుంచి ప్రారంభించి 15 ఏండ్లు నిండిన వారికి టీకా పంపిణీ జ‌రుగుతోంది. తాజాగా త్వ‌ర‌లోనే 5నుంచి 12 ఏండ్ల చిన్నారుల‌కు టీకా అందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో 5 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన కార్బెవాక్స్, రెండేళ్ల చిన్నారుల కోసం తయారుచేసిన కొవాగ్జిన్ వినియోగంపై నిర్ణయం తీసుకునేందుకు నిపుణుల కమిటీ గురువారం భేటీ అయ్యింది. వీటి ఫలితాలను విశ్లేషించిన అనంతరం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DEGI)కు సిఫార్సు చేయనుంది. చిన్నారుల కోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వినియోగ అనుమతి కోరుతూ ఆ సంస్థ కూడా గతంలో దరఖాస్తు చేసుకుంది. మ‌రోవైపు హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్-ఇ తయారు చేసిన కార్బెవాక్స్ టీకా వినియోగం అనుమతి కోసం ఆ సంస్థ ఇదివరకే దరఖాస్తు చేసుకొంది. వాటిని పరిశీలించిన ఎస్ఈసీ, వ్యాక్సిన్ వినియోగానికి డీసీజీఐకు సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఫలితాలను కూడా గురువారం నాటి భేటీలో సబ్జెక్టు నిపుణుల కమిటీ విశ్లేషించినట్లు సమాచారం. ఒకవేళ వీటి వినియోగానికి ఎస్ఈసీ సిఫార్సు చేస్తే మాత్రం చిన్నారుల టీకా పంపిణీపై కేంద్ర ఆరోగ్యశాఖ అతి త్వరలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.