ప‌రువు హ‌త్య పాపుల‌కు క‌ఠిన శిక్ష‌

జాతీయం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

ప‌రువు హ‌త్య పాపుల‌కు క‌ఠిన శిక్ష‌
– నాగ‌రాజు కుటుంబానికి అండ‌
– కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
– ఆర్థిక స‌హాయం, వ్య‌వ‌సాయ భూమి కూడ‌
– ప‌రామ‌ర్శించిన జాతీయ ఎస్సీ క‌మీష‌న్ చైర్మ‌న్ విజ‌య్ సంప్లా
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: స‌రూర్ న‌గ‌ర్‌లో జ‌రిగిన ద‌ళిత యువ‌కుడి ప‌రువు హ‌త్య పాపుల‌కు క‌ఠిన శిక్ష‌ప‌డేలా చేయ‌డంతో పాటు కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని జాతీయ ఎస్సీ క‌మీష‌న్ చైర్మ‌న్ విజ‌య్ సంప్లా పేర్కొన్నారు. ఈనెల 4న హైద‌రాబాద్‌లోని సరూర్ న‌గ‌ర్‌లో నాగ‌రాజు ప‌రువు హ‌త్య జ‌రిగిన విష‌యం తెల‌సిందే. శుక్ర‌వారం నాగ‌రాజు స్వ‌స్థ‌లం వికారాబాద్ జిల్లా మ‌ర్ప‌ల్లిలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. శ‌నివారం జాతీయ ఎస్సీ క‌మీష‌న్ చైర్మ‌న్ విజ‌య్ సంప్లా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు వివేక్ వెంక‌ట స్వామితో క‌లిసి ప‌రామ‌ర్శించారు. నాగ‌రాజు భార్య అశ్రిన్‌తో క‌లిసి మాట్లాడారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌రువు కోసం నాగ‌రాజును హ‌త్య చేసిన నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డేలా చూస్తామ‌న్నారు. అదేవిధంగా ఎస్సీ యాక్టు ద్వారా కుటుంబానికి రూ. 8.25 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం, ఇందులో స‌గం దాదాపు రూ. 4 ల‌క్ష‌లు త‌క్ష‌ణ‌మే అందేలా చూస్తామ‌న్నారు. అంతేకాకుండా కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం, వ్య‌వసాయ భూమి, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు, రూ. 5వేల ఫించ‌న్ అందేలా చూస్తామ‌న్నారు. నాగ‌రాజు హ‌త్య చేసిన నిందితుల‌లో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకోగా మిగ‌తా వారిని ప‌ట్టుకుని శిక్షించేలా చర్య‌లు తీసుకోవాల‌ని పోలీసు ఉన్న‌తాధికారుల‌కు సూచిస్తామ‌న్నారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష వేయించి కుటుంబానికి న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని పేర్కొన్నారు.

కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎంపీ, క‌లెక్ట‌ర్
మ‌రోవైపు ప‌రువు హ‌త్య‌లో బలైన నాగ‌రాజు కుటుంబాన్ని చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల త‌దిత‌రులు కూడ ప‌రామ‌ర్శించారు. మృతుని భార్య‌ను ప‌ల‌క‌రించి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఎంపీ వెంట వికారాబాద్ ఎమ్మెల్యే డా.ఆనంద్, ప్ర‌జా ప్ర‌తినిధులు ఉండ‌గా క‌లెక్ట‌ర్ వెంట అడిష‌న‌ల్ క‌లెక్టర్ మోతిలాల్, షెడ్యూల్ కులాల సంక్షేమ‌శాఖ అధికారి మ‌ల్లేశం, గిరిజ‌న సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, ఎస్సీ కార్పోరేష‌న్ ఈడీ మోజెస్, జాతీయ ఎస్సీ క‌మీష‌న్ మాజీ స‌భ్యులు రాములు త‌దిత‌రులు ఉన్నారు.