బీజేపీతో తెలంగాణలో మార్పు తథ్యం
– కుటుంబ పాలనతో అభివృద్ధి వెనక్కి అవినీతి ముందుకు
– పట్టుదల, పౌరుషానికి తెలంగాణ ప్రజలు మారుపేరు
– భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : దేశంలో బీజేపీ హావా కొనసాగుతోందని.. వేర్వేరు రాష్ట్రాలలో పార్టీ కొనసాగిన విజయాలతో తెలంగాణలో కూడ బీజేపీ మార్పు సాధించడం తథ్యమని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఉద్ఘాటించారు. గురువారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయంలో దిగిన ప్రధానమంత్రి నరేంద్రమోడి అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత సభలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై మోడి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనలో బందీ అయ్యిందన్నారు. ఈ పాలనలో అభివృద్ధి వెనుకడుగు వేస్తే అవినీతీ ముందడుగు వేసిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారని, వారికి శ్రద్దాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులతో పాటు కృషి చేసిన మహానుభావులు, ఉద్యమకారుల ఆశయాలు నెరవేరడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు పట్టుదలకు, పౌరుషానికి మారు పేరని అన్నారు. భారత ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. తాను రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా ఇక్కడి ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని అన్నారు. వారి ఆధారాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనను తరిమి కొడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణలో అధికార మార్పిడి జరగాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని, దేశంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలతో తెలంగాణ మార్పు తీసుకవస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివఋద్ధి కోసం ఎంతైనా పోరాటం చేస్తామన్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ సూత్రంతో బీజేపీ పనిచేస్తుందన్నారు.
20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా ఉందని అన్నారు ప్రధాని. స్మార్ట్ఫోన్ డేటా వినియోగదారుల జాబితాలో అగ్రస్థానంలో ఉందన్నారు. అంతర్జాల వినియోగదారుల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. స్టార్టప్స్ రూపకల్పన, వినియోగదారుల మార్కెట్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోందని కొనియాడారు. అయితే కరోనా విపత్తు వేళ భారత్ సామర్ధ్యం ప్రపంచానికి తెలిసిందని గుర్తు చేశారు. కొవిడ్ కారణంగా వ్యవస్థలోని గొలుసు సరఫరా పధ్ధతి పూర్తిగా దెబ్బతిందని.. అయితే విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధిలో భారత్ పురోభివృద్ధి సాధిస్తోందని అభిప్రాయపడ్డారు.
గత ఏడాది భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఈ ఘనతలన్నీ ప్రభుత్వ ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యం కాలేదని.. భారత్ సాధించిన ఘనతలో ఐఎస్బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఎంతో ఉందన్నారు. అనంతరం ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని.. బేగంపేట ఎయిర్ నుంచి చెన్నైకి, అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు.
ఈ వార్తను సమర్పించింది…



