బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు
– బాలిక అత్యాచారా విడియో, ఫోటోలు బయపెట్టినందుకు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార బాలిక వీడియో, ఫొటోలు బయపెట్టిన కారణంగా హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 228 (ఏ) సెక్షన్ కింద పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను రఘునందన్ మీడియాకు చూపించారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అమ్నేషియా పబ్ సంఘటకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ బాలిక అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలను, ఒక వీడియోను బయట పెట్టారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. మైనర్ బాలికకు సంబంధించిన వీడియోలను బహిరంగ పరిచినందుకు గాను రఘునందన్‌పై పలువురు విమర్శలు కూడా చేశారు. ఐపీసీ 228 (ఏ) ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు, ఫొటోల, ఆధారాలను బయటపెడితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల ఆధారంగా నేరంగా పరిగణిస్తారు. దీని ఆధారంగా ప్రస్తుతం రఘునందన్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వెబ్ రిపోర్టర్‌కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయటకు రావొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలున్నా, కారులోని వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలు ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ఎలా బయటకు వచ్చాయనే విషయాలపై స్పష్టత వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.


