సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలి
– అసాంఘీక కార్యక్రమాల నియంత్రణకు దృష్టి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
– యాలాలలో సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించిన ఎస్పీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామాల అభివృద్ధితో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరు ప్రాధాన్యమివ్వాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం యాలాల పోలీస్టేషన్ పరిధిలోని 5 గ్రామాలతో పాటు మైనార్టీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను జిల్లా ఎస్పీ ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో అబివృద్ధితో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడే నిఘా వ్యవస్థ ఏర్పాటు కోసం అందరు ముందుకు రావాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నకీలీ విత్తనాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, మట్కా వంటి అసాంఘీక కార్యక్రమాల నియంత్రణకు ప్రత్యేక దృష్టిసారించడం జరుగుతుందన్నారు. యాలాలలో ప్రధాన సమస్యగా ఉన్న అక్రమ ఇసుక రవాణా తరలింపుపై కూడ దృష్టిసారిస్తామన్నారు. అయితే ప్రజలు కూడ నకిలీ విత్తనాలు, రేషన్ బియ్యం తరలింపు, మట్కా రవాణా వంటి అసాంఘీక కార్యక్రమాలు తేలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు ఎస్పీ మండలంలోని రాస్నం 10, రాజీవ్, ఇందిరమ్మ కాలనీలలో 15, లక్ష్మీనారాయణ పూర్‌లో 4, యాలాలలో 13, బాగాయిపల్లిలో 3, రాజీవ్ కాలనీ సమీపంలోని మైనార్టీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పాటు అందించిన దాతలను ఎస్పీ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ జి. శేఖర్ గౌడ్, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐ అరవింద్, మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



