తుపాకీ దోపిడి దొంగ‌ల‌ను ప‌ట్టుకుంటాం

క్రైం వికారాబాద్

తుపాకీ దోపిడి దొంగ‌ల‌ను ప‌ట్టుకుంటాం
– అనుమానితులు క‌నిపిస్తే పోలీసుల‌కు తెల‌పండి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లా కుల్క‌చ‌ర్ల‌లో తుపాకితో బెధిరించి దోపిడి పాల్ప‌డిన దొంగ‌ల‌ను ప‌ట్టుకుంటామ‌ని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. శుక్ర‌వారం రాత్రి కుల్క‌చెర్ల గ్రామ శివార్లలో నివసించే జోగు అంజిలయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి తుఫాకితో బెదిరించి దోపిడికి పాల్పడిన సంఘ‌ట‌న శ‌నివారం వెలుగులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కేసు స‌మాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అద‌న‌పు ఎస్పీ ర‌సీద్‌తో క‌లిసి సంఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించారు. జోగు అంజిలయ్య, భార్య జోగు అలివేలుల‌తో మాట్లాడి జ‌రిగిన సంఘ‌ట‌న‌పై ఆరా తీశారు. అనంత‌రం ఎస్పీ మాట్లాడుతూ అంజిల‌య్య‌, అలివేలులు కూతురు లక్ష్మికలతో కలిసి తన ఇంట్లో సుమారుగా సాయంత్రం 8 గంటల సమయంలో భోజనం చేస్తున్నసమయంలో గుర్తుతెలియని న‌లుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి ఇంట్లో బీరువా దాచివున్న బంగారం, కుటుంబ సభ్యుల వద్ద ఒంటిపై వున్న బంగారాన్ని దోచుకెళ్లార‌ని విచార‌ణ‌లో గుర్తించామ‌న్నారు. బాధితుడు అంజిలయ్య ఫిర్యాదు మేరకు కుల్కచర్ల పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ కేసు లో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే కేసు ఛేదిస్తామని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా ఈ దోపిడికి సంభందించి ఎవరికైనా నిందితుల సమాచారం తెలిసిన లేదా ఎవరైనా వ్యక్తులపై అనుమానం వున్న పోలీసులకు తెలపాలని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకటరామయ్య, కుల్కచర్ల ఎస్ఐ గిరన్న‌లు ఉన్నారు.