నెలరోజులు అప్రమత్తం..!
– కరోనా పట్ల జాగ్రత్తలు ముఖ్యం
– డెంగీ, మలేరియా నియంత్రణకు చర్యలు
– ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: వర్షాల నేపథ్యంలో వచ్చె నెలరోజులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల, సీజనల్ వ్యాధుల నేపథ్యంతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు డీఎంహెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండమంటూ పలు సూచనలు చేశారు. డెంగీ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, వెంటనే చికిత్స అందించాలని చెప్పారు. ఒకవైపు అవగాహన పెంచడం, మరో వైపు సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోకుండా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకునెలా చూడాలన్నారు. చికిత్స, రోగ నిర్ధారణ పరీక్షల సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్, పంచాయతీ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుధ్యం పట్ల అవగాహన పెంచాలన్నారు. అంతేకాకుండా కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని ఆదేశాలను జారీ చేశారు. బూస్టర్ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి అధికారులు, వైద్య సిబ్బంది.. స్థానిక ఎంపీలు, ఎమ్మేల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాస రావు, డీఎంఇ రమేష్ రెడ్డి, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, TSMSIDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సిఇ విజయ్ కుమార్, వివిధ అరోగ్య కార్యక్రమాల ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.



