సర్కారు భజనకే సరిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
– సమస్యలపై వికారాబాద్ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
– ప్రజా పోరాట దీక్షలో ములుగు ఎమ్మెల్యే సీతక్క
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలంతా సర్కారుకు భజన చేయడానికే సరిపోయారని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనీయర్ నాయకులు సీతక్క అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరాట దీక్షకు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన మాట కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వస్తాయనుకున్న కలలను సీఎం కేసీఆర్ నాశనం చేశారని అన్నారు. కేవలం ఆయన కుటుంబానికి పదవులు, ఉద్యోగాలు కల్పిస్తున్నారని విమర్శించారు. దీనికితోడూ దళితులకు మూడెకరాలు, పేదలకు స్థలాలను ఇస్తామన్నా కేసీఆర్ తన ఫాంహౌస్ కోసం పేదల భూములను లాక్కున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో పేదల నడ్డి విరిచాయన్నారు. కాని తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చెక్క భజన చేయడానికే ఉన్నట్లుగా కనిపిస్తోందని, ఈ జాబితాలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడ ఉన్నారని అన్నారు. ప్రభుత్వానికి భజన చేయడం ఆపీ ప్రజల సమస్యలపై పోరాడాలని ఎమ్మెల్యే ఆనంద్‌కు సూచించారు. వికారాబాద్ నియోజకవర్గాన్ని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తన కుటుంబంగా భావించి అభివృద్ధి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది పేదల ప్రభుత్వం.. కాంగ్రెస్సేనని పేర్కొన్నారు.
బ్రిడ్జిలను వెంటనే నిర్మించాలి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న నియోజకవర్గాలలో వరథల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. వరధల్లో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షల పరిహారం అందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు బ్రిడ్జీలను వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

