రెచ్చిపోయిన దొంగలు..!
– ఇంట్లో యజమాని లేడని తెలిసి కన్నం
– 12 తులాల బంగారం, రూ. 30 వేల చోరి
– పరిశీలించిన డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
– క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో వివరాల సేకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరులో గుర్తుతెలియని దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో యజమాని లేడని తెలిసీ కన్నం వేశారు. ఇంట్లో అలమారలో ఉన్న బంగారం, నగదు, ఇతర వస్తువులను అపహరించుకుపోయారు. ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి మిరాజ్ సంధాని పాత తాండూరులో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులకు సంబంధించి ఓ శుభకార్యంలో కుటుంబంతో కలిసి బయటకు వెళ్లినట్లు సమాచారం. అయితే రాత్రి ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారు జామున గమనించిన కుటుంభ సభ్యులు చోరీ జరిగినట్లు అనుమానించారు.

వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయాన్ని తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్‌కు తెలిపారు. దీంతో డీఎస్పీ శేఖర్ గౌడ్ కూడ సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఇంటి అంతస్తు వెనుక నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కుటుంబ సభ్యులతో ఆరా తీయగా ఇంట్లో అల్మారాలో ఉన్న 12 తులాల బంగారం, రూ. 30 వేల నగదు చోరి గురైందని వెల్లడించారు. వెంటనే డీఎస్పీ శేఖర్ గౌడ్ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దించి చోరీపై విచారణ ముమ్మరం చేశారు. ఇంటి యజమానికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు పాత తాండూరులో జరిగిన చోరీలో పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు అపహరణకు గురై ఉంటుందని గుసగుసలు వినిపించాయి. ఆదివారం తెల్లవారు జామున పోలీసుల రాకతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.



