మహిళ చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ
– ఆమె స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహిళ చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలుస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం చాకలి ఐలమ్మ 127వ జయంతిని తాండూరులో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన జయంతిలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కౌన్సిలర్లు, అధికారులు, నేతలతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూజలు చేశారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ వెనుకబడిన కులానికి చెందిన ఐలమ్మ పోరాట ప్రతిమ, త్యాగం మరువలేనివన్నారు. మహిళ చైతన్యానికి, ఆత్మగౌరవానికి ఆమె ప్రతీకగా నిలుస్తుందని అభివర్ణించారు. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని కొనసాగించడంతో పాటు ఆమె ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. అనంతరం కౌన్సిలర్లు, నేతలు, అధికారులు చాకలి ఐలమ్మ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సాజిద్ అలీ, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, వెంకన్న గౌడ్, బోయ రవి రాజు, యువ నాయకులు బి.రఘు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


