ఇంటింటికి బూస్టర్ డోసు..!
– అధికారులకు మంత్రి హరీష్ రావు సూచన
– త్వరలో కార్యాచరణకు ప్రణాళిక
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సోమవారం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీ ఆర్ కే భవన్ లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలంటూ మంత్రి కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పరిశుభ్రతపై ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అదేవిధంగా వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని.. పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే దీనికనుగుణంగా అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సైతం సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని హరీశ్ రావు కోరారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఆయా శాఖలకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Addressing the press conference from BRKR Bhavan on Seasonal Diseases https://t.co/xLeltlFFRk
— Harish Rao Thanneeru (@trsharish) July 25, 2022



