కామ‌న్‌వెల్త్‌లో ప‌త‌కాల పంట‌

కెరీర్ క్రీడలు జాతీయం తెలంగాణ హైదరాబాద్

కామ‌న్‌వెల్త్‌లో ప‌త‌కాల పంట‌
– రికార్డులు సాధించిన చాంపియ‌న్‌లు
– అభినందించిన ప్ర‌ధాని మోడి
ద‌ర్శిని డెస్క్ : కామన్‌వెల్త్ క్రీడ‌ల్లో భార‌త క్రీడాకారులు ప‌త‌కాల పంట పండించారు. రెండోరోజు జ‌రిగిన పోటీలలో ఒకటి కాదు రెండుకాదు ఏకంగా నాలుగు పతకాలు సాధించారు. వీటిలో స్వర్ణ పతకాన్ని లిఫ్టింగ్‌ క్వీన్‌, 27 ఏళ్ల మణిపురి ముత్యం మీరాబాయి చాను సాధించింది. మహిళల 49 కిలోల విభాగంలో పలు రికార్డులను తిరగ రాసిన ఆమె ఈసారి గేమ్స్‌లో మనకు తొలి పసిడి పతకం అందించింది.

దుమ్మురేపిన జెరెమి లాల్‌రిన్నుంగా
కామన్‌వెల్త్ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రిన్నుంగా దుమ్మురేపాడు. 67 కేజీల విభాగంలో ఈ 19 ఏళ్ల కుర్రాడు రికార్డు సృష్టిస్తూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 154 కేజీలు ఎత్తిన లిఫ్టర్‌.. రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300కేజీలుకు పైగా ఎత్తి ఓవరాల్‌గా రికార్డు సృష్టించాడు.

సంకేత్‌కు రూ.30లక్షల రివార్డు
మరోవైపు, వెయిట్‌ లిఫ్టింగ్‌ 55 కిలోల విభాగంలో రజత పతకంతో మెరిసిన సంకేత్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నగదు రివార్డు ప్రకటించారు. సంకేత్‌కు రూ.30లక్షలు, ఆయన ట్రైనర్‌కు రూ.7లక్షల చొప్పున రివార్డుగా ఇవ్వనున్నట్టు సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది.

బింద్యారాణికి ర‌జ‌తం
వెయిట్‌ లిఫ్టింగ్‌ 55కిలోల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి రజతం గెలుచుకుంది. స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్ చేసిన బింద్యారాణి.. భారత్‌కు నాలుగో పతకాన్ని సాధించి పెట్టింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ టాప్-10లో నిలిచింది.

మ‌రోవైపు కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో స‌త్తాచాటిన క్రీడాకారుల‌ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో అభినందనలు తెలియజేశారు. ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.