సవాల్ స్వీకరిస్తాం..!
– రాజుగౌడ్‌పై స్థాయి మరిచి మాట్లాడొద్దు
– ఎమ్మెల్సీకి దూరంగా ఉన్నది అందుకే
– ఖండించిన మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్యాకేజీ రాజకీయాలను ఆపాదిస్తూ రాజుగౌడ్‌పై ఎమ్మెల్సీ వర్గీయులు చేసిన ఆరోపణ సవాళ్లను స్వీకరిస్తామని తాండూరు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, రాజుగౌడ్ సోదరుడు సుమిత్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వారి నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
రాజుగౌడ్ ప్యాకేజీ రాజకీయాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ వర్గీయులు చేసిన వాఖ్యలను ఖండించారు. చైర్ పర్సన్ పదవి ఒప్పందం విషయంలో కట్టుబడి ఉండాలని కోరితే రాజుగౌడ్ పై స్థాయి మరిచి విమర్శలు చేయడం మంచిపద్దతి కాదన్నారు. పార్టీ కోసం పనిచేస్తుంటే గ్రూపు రాజకీయాలంటూ కొట్లాటతో రాద్ధాంతాలు చేస్తున్నారని విమర్శించారు. చైర్ పర్సస్ అవినీతికి ప్రోత్సహిస్తున్నందుకే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి రాజుగౌడ్, తాను దూరంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిలిచి పార్టీ కోసం పనిచేయాలని కోరితే వెళ్లడం జరిగిందని వివరించారు. కౌన్సిలర్ పదవి కోసం కన్న పేగునే కాదన్న మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల రాజుగౌడ్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో పట్లోళ్ల నర్సింలు తన వార్డులో లీడ్ ఎలా వచ్చిందో తెలపాలన్నారు. రాజుగౌడ్ ప్యాకేజీ రాజకీయాలపై కోసి దర్గాలో ప్రమాణం చేయాలంటూ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామన్నారు. చైర్ పర్సన్‌ను దించకుండా ఉండేందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వర్గీయులు అంత నిజాయితీ పరులైతే రాజీనామాకు సిద్ధమై ఎన్నికలకు వచ్చి గెలుపొందాలన్నారు. ఒప్పందం కట్టుబాటుపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చైర్ పర్సన్ పదవి విషయంలో అందరు సమన్వయంతో సాగి తాండూరు అభివృద్ధిపై దృష్టిసారించేలా శ్రద్ధ వహించాలన్నారు. రాజుగౌడ్ పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. అదేవిధంగా పార్టీలో తగాదాలు జరిగేలా వ్యవహరిస్తున్న నాయకులపై అధిష్టానంకు ఫిర్యాదు చేస్తామని, చర్యలు తీసుకునేవిధంగా కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు శివానంద్, ఎర్రం శ్రీధర్ తదితరులు ఉన్నారు.



