పుర పట్ట(o)పురాణి.. పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పుర పట్ట(o)పురాణి.. పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి..!
– మరో హాట్రిక్‌ కౌన్సిలర్‌కు వైస్ చైర్మన్ పదవి..?
– నిర్ణయానికి వచ్చిన అధిష్టానం, ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్మన్‌ ఎవరు అనేది దాదాపు ఖరారయ్యింది. మున్సిపల్ వైస్ చైర్మన్‌ ను ఎంపిక చేశారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో 36వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండానే బరిలో దిగారు. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది విజయం సాధించారు.

ఎన్నికల ముందు నుంచే పార్టీ చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్‌ను కొనసాగించారు. ఎన్నికలు జరిగినన్నినాళ్లు సాయిపూర్‌కు చెందిన పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, బంటు వేణు, 27వ వార్డు అభ్యర్థి ఉప్పరి స్వరూప పేర్లు బలంగా వినిపించాయి. శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపుకు తరలించారు. ఈనెల 16న తాండూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో హాట్రిక్ కౌన్సిలర్‌గా నిలిచిన పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డినే మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

2014 ఎన్నికల్లో పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2019లో 11వ వార్డు నుంచి మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా 12వ వార్డు నుంచి పోటీ చేసి పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి హాట్రిక్ కౌన్సిలర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్లలో పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డికే సీనీయారిటి ఉంది. రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా గెలిచిన ఆమెను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చైర్ పర్సన్ అభ్యర్థిగా నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇక మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన హాట్రిక్ కౌన్సిలర్ అబ్దుల్ రజాక్‌ పేరును ప్రతిపాదించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

చైతన్యలో జోష్‌..!