సీఎం ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

సీఎం ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
– విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి
– వికారాబాద్ జిల్లా నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప‌రిశీలించిన మంత్రి
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఈనెల 16న వికారాబాద్ జిల్లాలో జ‌రిగే ముఖ్యంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి అన్నారు. శుక్ర‌వారం వికారాబాద్ జిల్లా నూత‌న క‌లెక్ట‌రేట్‌ కార్యాలయ సముదాయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం బహిరంగ సభ స్థలం, వేదికలను పరిశీలించి మంత్రి పలు సూచనలు చేశారు. అనంత‌రం మంత్రి స‌బితారెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. మినిట్ టూ మినిట్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు. ఒక్కో విభాగానికి జిల్లా స్థాయి అధికారులను నియమించి నిశితంగా పరిశీలించాలని, ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలన్నారు. అధికారులు మొత్తం కార్యక్రమానికి సంబందించిన వివరాలను మ్యాపుల ద్వారా మంత్రికి వివ‌రించారు. ముఖ్యమంత్రి పర్యటనకు మరో మూడు రోజులు మిగిలి ఉండటంతో మిగిలిన‌ పనులను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మంత్రితో క‌లిసి ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలేరు యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటి రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ కూడా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.