నిమ‌జ్జ‌నానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

నిమ‌జ్జ‌నానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
– కోక‌ట్ కాగ్నాన‌దిని సంద‌ర్శించిన డీఎస్పీ శేఖ‌ర్ గౌడ్
– హిందూ ఉత్స‌వ స‌మితి స‌భ్యుల‌తో ఏర్పాట్ల ప‌రిశీల‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి:
తాండూరులో వినాయ‌క నిమ‌జ్జ‌న స్థ‌లం ఖ‌రారైంది. యాలాల మండ‌లం కోక‌ట్ కాగ్నాన‌దిలో నిమ‌జ్జ‌నం నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం తాండూరు డీఎస్పీ జీ.శేఖ‌ర్ గౌడ్ కాగ్నాన‌దిని సంద‌ర్శించారు. జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్, హిందూ ఉత్స‌వ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ట్లోళ్ల న‌ర్సింలు స‌భ్యుల‌తో క‌లిసి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. అయితే కాగ్నాన‌దిలో నిమ‌జ్జ‌నం చేసేందుకు ఇబ్బందులు ఉన్నాయ‌ని గ్రామ‌స్తులు డీఎస్పీ శేఖ‌ర్ గౌడ్ దృష్టికి తెచ్చారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో డీఎస్పీ శేఖ‌ర్ గౌడ్ మాట్లాడుతూ తాండూరు కాగ్నాన‌ది వంతెన‌కు మ‌ర‌మ్మ‌త్తులు రావ‌డంతో నిమ‌జ్జ‌నానికి ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌న్నారు. ఇంత‌లో అక్క‌డ నిమ‌జ్జ‌న ఏర్పాట్లు చేయ‌డం సాధ్యం కాద‌ని, కావున కోక‌ట్ కాగ్నాన‌దిలో నిమ‌జ్జ‌నానికి స‌హ‌క‌రించాల‌న్నారు. ఇందుకు గ్రామ‌స్తులు అంగీక‌రించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. గ్రామ‌స్తులు చెప్పిన విధంగా ఏర్పాట్లు చేయించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అదేవిధంగా నిమ‌జ్జ‌నం రోజు ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా భ‌ద్ర‌త చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స‌హాకారంతో నిమ‌జ్జ‌నానికి ఏర్పాట్లు చేయిస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు రూర‌ల్ సీఐ రాంబాబు, యాలాల ఎస్ఐ అర‌వింద్, హిందూ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు, కోక‌ట్ గ్రామ‌పెద్ద‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.