పండగకు ఊరెళితే.. జాగ్రత్త..!
– విలువైన వస్తువులు ఇంట్లో ఉంచుకోవద్దు
– సొంత గ్రామానికి వెళితే సమాచారం ఇవ్వాలి
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పండగ సమయాల్లో పట్టణవాసులు అప్రమత్తంగా ఉండాలని, పట్టణం నుంచి సొంత ఊరువెళితే జాగ్రత్తలు పాటించాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ పండగకు ఊరెళ్లే హడావిడిలో విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దన్నారు. బంగారు నగలు, వెండి వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయో.. లేదో చేసుకోవాలని, తలుపులకు వేసిన తాళం కప్ప కనిపించకుండా డోర్కర్టెన్లు ఏర్పాటు చేయాలని, ఇంటికి సెంట్రల్ లాకింగ్తోపాటు అలారమ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. వాచ్మన్లకు జాగ్రత్తలు చెప్పాలన్నారు. ఇంటి ఆవరణలో లైట్లు వెలిగేలా చూసుకోవాలన్నారు. ఊరెళితే స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇస్తే రాత్రిపూట పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీలో ఉంటారని అన్నారు. ఇంటి పక్కనున్న వారికి తమ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలన్నారు. అనుమానం వస్తే వెంటనే డయల్-100కు సమాచారం అందించాలన్నారు. పండగ వెళ ఇంటి దొంగతనాలపై అందరు బీకేర్ పుల్గా ఉండాలన్నారు.

