వీర్ఏలకు ఊరట.!
– సర్కారుతో చర్చలు సఫలం
– ఇక రేపటి నుంచి విధుల్లోకి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : డిమాండ్ల సాధన కోసం దాదాపు 80 రోజులుగా సమ్మెకు దిగిన వీఆర్ఏలకు ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలం అయ్యాయి. దీంతో వీఆర్ఏలు సమ్మెను విరమించి రేపటి నుంచి విధుల్లోకి వెళ్లబోతున్నాయి. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో వీఆర్ఏలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎస్ సోమేశ్ కుమార్‌తో జరిపిన చర్చలలో మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సమస్యలను పరిష్కారిస్తామని సీఎస్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. సమ్మె కాలం జీతం,దానితో పాటు సమ్మె చేస్తున్నప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం వంటి వాటి అంశాలతో పాటు ప్రమోషన్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరామని, సీఎస్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో.. రేపట్నుంచి విధులకు హాజరవుతాయని పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

